అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖల అభివృద్ధి గురించి నివేదికలతో కూడిన బుక్ లెట్లను సిద్దం చేసినట్లు స్పష్టం చేశారు. తొలి బుక్ లెట్ ను శాసన సభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడుకి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్ స్వంత నియోజకవర్గంలో రూ. 312 కోట్లు మంజూరు చేశామన్నారు డిప్యూటీ సీఎం. ఇక ఇదే క్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకి రూ. 487 కోట్లు కేటాయించామన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన సీఎంకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. పల్లెల అభివృద్ది, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు .
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో తన పరిధిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో ప్రత్యేక బుక్ లెట్ ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. నియోజక వర్గాలవారీగా నిధుల కేటాయింపు, పనుల పురోగతిని వివరించే నివేదిక పుస్తక రూపంలో రూపొందించి సంబంధిత నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు అందజేసే కార్యక్రమం మొదలైందని తెలిపారు. శాసనసభలో ఈ బుక్ లెట్ ను మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా గ్రామాల్లో వేసిన సిమెంటు రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్, నీటి తొట్టెల వివరాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల వివరాలు పొందుపరిచారు.
15వ ఆర్ధిక సంఘం నిధులు నియోజకవర్గాల వారీగా పంచాయతీలకు ఎంత మొత్తం విడుదల చేశామన్న అంశాన్ని కూడా బుక్ లెట్ లో పొందుపరిచారు. కూటమి పక్షాల ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు చేసిన కేటాయింపులకు కూడా పుస్తకరూపం ఇచ్చారు.