మహనీయుల ఆలోచన మేరకు ముందుకెళ్లాలి : అడ్లూరి లక్ష్మణ్
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీదే కీలక పాత్ర
హైదరాబాద్ ; మహనీయులు చూపిన బాటను మరిచి పోవద్దన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్ని రోజులు శక్తి ఉంటే అన్ని రోజులు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ఉద్యోగుల సంక్షేమ కోసం నిరంతరం పాటుపడతానని స్పష్టం చేశారు. అంబేద్కర్ సూచించిన విధంగా కేవలం చదువు ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారని అన్నారు. అందులో భాగంగానే లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో అంబేద్కర్ నాలెడ్జి సెంటర్ కోసం, నింబోలి అడ్డ లో ఒక లైబ్రరీ , హాస్టల్ ను ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ లో ముఖ్యమంత్రి నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
మహనీయులు చూపిన మార్గంలో ఉద్యోగస్తులందరూ నడవాలని తద్వారా ఆయా వర్గాలకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను క్షేత్రస్థాయిలో అందేలా చూడాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. మనందరం ఒక గొప్ప సందర్భంలో కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తునన్నారు అడ్లూరి లక్ష్మణ్. ఈ ఏప్రిల్ మాసం భారత దేశ చరిత్రలో ఒక విశిష్టమైన నెల అని పేర్కొన్నారు . ఈ నెలలోనే మహనీయులు అయిన బాబు జగ్జీవన్ రామ్, డా.బి ఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే లాంటి గొప్ప మహానుభావులు జన్మించారనీ తెలిపారు. వీరు కేవలం వ్యక్తులు మాత్రమే కాదన్నారు. ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక సమానత్వ దార్శనికతకు దర్పణంగా నిలిచారని కొనియాడారు.
