హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థపై సమీక్ష చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందించ గలిగితే విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపుతారని అన్నారు. విద్యా శాఖతో పాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందజేసే సామగ్రి పై కీలక సూచనలు చేశారు సీఎం. గతంలో ఏ శాఖకు ఆ శాఖ విడిగా ప్రొక్యూర్మెంట్, సరఫరా చేపట్టడంతో ఏకరూపత లోపించడంతో పాటు అనేక అక్రమాలు చోటు చేసుకునేవని, వాటిని అరికట్టేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చామని అన్నారు.
అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తుందని, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కాదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవే ఉండాలన్నారు. నాణ్యతతో పాటు సకాలంలో అందడంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు రేవంత్ రెడ్డి.
జూన్ 15నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి మొత్తం అందాలని, అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తాం అన్నారు సీఎం. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధిత మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని అన్నారు. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
