నారాయ‌ణ సేవా సంస్థ‌న్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

కితాబు ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా

హైదరాబాద్ : నారాయ‌ణ్ సేవా సంస్థాన్ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత మాడ్యులర్ కృత్రిమ అవయవాల (లింబ్స్ & కాలిపర్స్) పంపిణీ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేశారు. కొత్త అవయవాలతో పలువురు లబ్ధిదారులు మొదటిసారి నడవడం, ఆడుకోవడం, స్వతంత్రంగా పనులు చేసుకోవడం వంటి భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ ఈ రోజు కనిపించిన దృశ్యాలు మానవత్వానికి నిద‌ర్శనం. నారాయణ సేవా సంస్థాన్ చేస్తున్న సేవలు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ దివ్యాంగులను సమాజంలో ప్రధాన ప్రవాహంలోకి తీసుకు రావడంలో ఈ కార్యక్రమం ఎంతో కీలకం. ఇది సేవ మాత్రమే కాదు, జీవితాలను మార్చే ఉద్యమం అని పేర్కొన్నారు.

సామాజిక సేవకుడు సత్య భూషణ్ జైన్, పేట్రన్ అల్కా చౌధరీ, ట్రస్టీ , డైరెక్టర్ దేవేంద్ర చౌబిసా, పీఆర్ హెడ్ భగవాన్ ప్రసాద్ గౌర్ ప్రముఖులను సాంప్రదాయంగా ఆహ్వానించారు. ఫిబ్రవరి 1న నిర్వహించిన ఎంపిక శిబిరంలో 1,000 మందికి పైగా దివ్యాంగులు నమోదు చేసుకోగా, అందులో 745 మందికి ఈ శిబిరంలో సేవలు అందించామని తెలిపారు. నిపుణుల బృందం ఆధునిక నారాయణ మాడ్యులర్ కృత్రిమ అవయవాలను అమర్చడంతో పాటు, వాటి వినియోగం, నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చినట్లు చెప్పారు. శిబిరానికి వచ్చిన అందరికీ ఉచిత భోజనం, తాగునీరు, టీ వంటి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. నారాయణ సేవా సంస్థాన్ 1985 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇప్పటి వ‌రకు లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలు, వేలాది మందికి కృత్రిమ అవయవాలను అందించింది.

Leave A Reply

Your Email Id will not be published!