అమరావతి : సహకార శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల పరిరక్షణ కోసం తమ సర్కార్ కృషి చేస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మంది వివిధ కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.వి. ఫణి పేర్రాజు నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పదోన్నతులు పొందిన ఉద్యోగులు విజయవాడలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాల మేరకు పదోన్నతులు త్వరితగతిన మంజూరు చేయడమే కాకుండా, పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేసినందుకు ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపింది.
ప్రమోషన్లు పొందిన ఉద్యోగుల అభ్యర్థన మేరకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుడారు. ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడమే కాకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, వారి హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే సహకార శాఖలో వివిధ కేడర్ల ఉద్యోగులకు జారీ చేసిన ప్రమోషన్లలో 100 శాతం పారదర్శకత పాటించామని మంత్రి తెలిపారు.
