విజయవాడ : రాష్ట్రంలో బీసీ సంక్షేమ విద్యా సంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు బీసీ వర్గాలకు మాత్రమే కాకుండా సమాజానికే ఆదర్శం నిలిచారని కొనియాడారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులు, సిబ్బంది, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
బీసీ సంక్షేమ శాఖను రాష్ట్రంలో ఆదర్శ శాఖగా తీర్చిదిద్దడంలో శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున్, ఎంజేపీ సొసైటీ కార్యదర్శి మాధవీలతతో పాటు అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నానని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన ఉపాధ్యాయులు, ఆహారం, వసతులు అందుబాటులో ఉండటంతో బీసీ వెల్ఫేర్ విద్యా సంస్థలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీసీ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు.
