అమరావతి : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే ఈసారి టీడీపీ ఆధ్వర్యంలో మహానాడును నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తీసుకున్న ఈ నిర్ణయం దూరదృష్టికి నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజా ధనం, పార్టీ వనరుల వినియోగంలో పొదుపు పాటిస్తూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించాలనే సీఎం చంద్రబాబు ఆలోచన ప్రతి కార్యకర్తకు ఆదర్శమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త మహానాడులో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవడం పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయమని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.
ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా రాష్ట్ర నాయకత్వం, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనే విధంగా రూపొందించిన ఈ వ్యవస్థ పార్టీని మరింత బలోపేతం చేస్తుందన్నారు. పార్టీని కాలానుగుణంగా ఆధునీకరించడంలో తెదేపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. యువత, టెక్నాలజీ, పార్టీ వ్యవస్థలను సమన్వయం చేస్తూ మహానాడును డిజిటల్ స్థాయిలో విజయవంతం చేయడానికి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి దిశను మరింత స్పష్టంగా తెలియ జేస్తుందని మంత్రి పేర్కొన్నారు.