అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. బుధవారం ఆయన ఎరువుల వినియోగంపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విధుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ను ఆదేశించారు అచ్చెన్నాయుడు.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఎరువుల కొరత సృష్టించే వారిపై చట్ట పరంగా చర్యలు ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అలసత్వం పనికి రాదన్నారు అచ్చెన్నాయుడు. జిల్లాల వారీగా ఎరువుల స్టాక్‌లపై రోజువారీ మానిటరింగ్ చేస్తామన్నారు. అక్రమ రవాణాపై విజిలెన్స్, ప్రత్యేక బృందాల నిఘా పెంచుతామన్నారు. రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు . ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
