అమెరికా : ఇప్పటికే ఏఐ దెబ్బకు వేలాది మంది ఇంటి బాట పట్టగా బుధవారం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మెటా ( ఫేస్ బుక్, వాట్సాప్ ) లో 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఉదయం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఇక నుంచి ఇంటి నుండి పని చేసేందుకు సిద్దం కావాలని ఆదేశించింది. తెల్లవారుజామున 4 గంటలకు లే ఆఫ్స్ ప్రకటించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇదిలా ఉండగా మెటా గత నెలలో ఉద్యోగ కోతలను ధృవీకరించింది. కంపెనీలో ఉద్యోగుల నైతిక స్థైర్యం తీవ్రంగా పడిపోయింది. కొంతమంది సిబ్బంది ఉచిత స్నాక్స్, అదనపు ల్యాప్‌టాప్ ఛార్జర్‌లను సేకరించడం ప్రారంభించడం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా మెటా ముందస్తుగానే అమెరికా, బ్రిటన్‌తో సహా వివిధ ప్రాంతాలలోని ఉద్యోగులకు ఆఫీసుకు రావద్దని ఈమెయిల్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం మెటా, అనుబంధ సంస్థలలో పని చేస్తున్న వారిలో 10 శాతానికి పైగా కోత విధించింది యాజమాన్యం. అయితే తీసివేతకు సంబంధించి మొదటి సందేశాలు దాని సింగపూర్ హబ్ నుండి వచ్చినట్లు సమాచారం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం సింగపూర్‌లోని ప్రభావిత ఉద్యోగులకు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు) ఈమెయిల్స్ అందాయి. టైమ్ జోన్‌లకు అనుగుణంగా, నోటిఫికేషన్‌లు దశల వారీగా పంపించింది మెటా. ఈ చర్యకు ముందు మెటాలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు, వేలాది మందిని తొలగించారు. ఇంకా వేలాది మందిని వేరే చోట్లకు బదిలీ చేస్తున్నారు. ఒక అంతర్గత మెమోలో, చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ మాట్లాడుతూ 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ-నేటివ్ బృందాలలోకి తిరిగి నియమించనున్నట్లు తెలిపారు.
