అమరావతి : ఏపీ జనసేన పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కొందరు పనిగట్టుకుని నిరాధారమైన , ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపింది. రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడానికి క్షుద్ర శక్తులు కొందరు వృత్తిగా మార్చుకుంటున్నారని ఆరోపించింది జనసేన పార్టీ.. ముఖ్యంగా ప్రచార , ప్రసార, సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు ఊసర వెల్లులుగా మారి తమను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది పార్టీ.
జరిగింది జరగనట్టు.. జరగని దానిని జరిగినట్టు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వాపోయింది. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు కోలేనంతగా మసిపూసి మారేడు కాయలా చేస్తున్నారని మండిపడింది . రాజకీయ వ్యవస్థకు, సమాజానికి చేటుగా ప్రమాద భరితంగా మారుతున్న ఇటువంటి ప్రచార కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి జనసేన సంకల్పించిందని స్పష్టం చేసింది.
దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్దే పరమావధిగా పని చేసే జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీదా, నాయకులపై ఎటువంటి అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణం పోలీస్ కేసులు, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నిర్ణయించిందని ప్రకటించింది. అవాస్తవాలు ప్రచారం చేసేవారు ఎవరైనా, ఎంతటి స్థాయిలో ఉన్నా సరే కేసులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించింది.