చెన్నై నగర పోలీస్ కమిషనర్ గా కొలువు తీరిన అమల్ రాజ్
సంచలన నిర్ణయం తీసుకున్న తిరు సీఎం జోసెఫ్ విజయ్
చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మేలు చేకూర్చేలా తమ నిర్ణయాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ గా అత్యంత సమర్థుడైన, నిజాయితీ కలిగిన ఆఫీసర్ గా గుర్తింపు పొందిన ఆస్రా గార్గ్ ను నియమించారు సీఎం. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. ఎవరికీ లొంగని ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. మరో వైపు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మరో నిక్కచ్చి, నిజాయితీకి మారు పేరు గా గుర్తింపు పొందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎ. అమల్ రాజ్ కు అత్యంత కీలకమైన చెన్నై నగర పోలీస్ కమిషనర్ గా (బాస్ ) గా నియమించారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.
దీంతో ఎ. అమల్ రాజ్ శుక్రవారం చెన్నై నగర పోలీస్ కమిషనర్ గా కొలువు తీరారు. ఆయన 1996వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. అమల్‌రాజ్ తన ఛాంబర్లో అధికారిక పత్రాలపై సంతకం చేసిన అనంతరం, చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సంక్షిప్త కార్యక్రమానికి సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు. పదవి చేపట్టిన వెంటనే, అమల్‌రాజ్ గిండిలోని రాజ్‌భవన్‌కు వెళ్లి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఎమ్మెల్యే షాజహాన్, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) ఎమ్మెల్యే వన్ని అరసుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ రాష్ట్ర మంత్రివర్గంలోకి ఈ ఇద్దరు శాసనసభ్యులను చేర్చుకున్నారు.