గోదావరి స్వచ్ఛతకు పారిశ్రామికవేత్తలు సహకరించాలి

కాలుష్య వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలి

అమ‌రావ‌తి : గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికివేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రగతికి కూటమి ప్రభుత్వం అడ్డు పడబోదని స్పష్టం చేశారు. అదే సమయంలో పరిశ్రమల యాజమాన్యం కూడా కాలుష్య కారకాలను నివారించి, శుద్ధి చేసే ప్లాంట్లను పద్ధతులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి పుష్కరాల ప్రత్యేక సమీక్ష అనంతరం పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పరిశ్రమల నుంచే వ్యర్ధాలు నేరుగా నదీ జలాల్లో కలప కూడదనే నిబంధన ఉందన్నారు.

ప్రతి పరిశ్రమ శుద్ధి ప్లాంటు నిర్వహణ తప్పనిసరి చేసుకోవాలన్నారు వ్యర్ధాలను ఆధునిక పద్ధతులను ఉపయోగించి పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుంద‌న్నారు. ప్రజలకు తాగు, సాగునీటికి వినియోగించే నీటిలో కాలుష్యకారక వ్యర్ధాలు కలపడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భవిష్యత్తు తరాలకు కొత్త ఆరోగ్య సమస్యలు పుడతాయన్నారు. వీటిని పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టుకొని కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలని స్ప‌ష్టం చేశారు. పరిశ్రమల్లో శుద్ధిప్లాంట్ల నిర్వహణ వ్యయాన్ని ఏమాత్రం భారం అనుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల‌ని సూచించారు.

ఇక నుంచి తప్పనిసరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలుష్యంత్రణ మండలి ప్రతి పరిశ్రమ ను ఆడిట్ చేసి, ఆ పరిశ్రమ పరిస్థితిని రెడ్, ఎల్లో, గ్రీన్ విభాగాలుగా గుర్తిస్తుంద‌ని చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయం, నదుల్లో ఇమిడి ఉంటుందన్నారు. వాటిని రక్షించు కోవడం మన బాధ్యతగా భావించాలే త‌ప్పా భారంగా అనుకోకూడ‌ద‌ని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!