రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం : సీఎం

జూలైలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన

అమరావతి : రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టూ హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుకు చేర్చేలా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా తక్కువ వ్యయంతో ఇంటి వద్దకే చేరేలా ఈ కొత్త వ్యూహం ఉపయోగ పడుతుందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసారి రాష్ట్రంపై ఎల్ నినో చూపుతున్న ప్రభావాలను అంచనా వేస్తూ ప్రాంతాల వారీగా పంటల సాగు అంచనా జరగాలని, దానికి అనుగుణంగానే చర్యలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎస్- హాఫ్ మూన్ విధానాల్లో సేద్యం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్ నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని రైతులు నష్ట పోకుండా పంటలకు కనీస మద్ధతు ధర లభించేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో కేంద్ర సహకారం కూడా తీసుకుని ఏపీలో చేపడుతున్న ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సాగుతో విజయవంతమైన రైతుల సేవల్ని కూడా వినియోగించు కోవాలని సీఎం సూచించారు. కరవు ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు చోట్ల పశువుల దాణా పండించేలా చూడాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణతో పాటు ఆధునీకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు చేసి ఏ పంటకు భూములు అనువుగా ఉన్నాయన్నది రైతులకు తెలియచేయాలన్నారు. భూసార పరీక్షలు చేసి వాటి వివరాలను రైతులు పొందేలా ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రకృతి సేద్యం సహా ఎన్ఎంఎన్ఎఫ్ పథకం అమలు కోసం కేంద్రానికి లేఖలు రాయాలని సీఎం నిర్దేశించారు. రైతు బజార్లు, ప్రైవేటు మార్కెట్లలో ప్రకృతి సేద్యం ద్వారా పండిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!