అమరావతి : కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి పంజరాన పట్టుబడను నేను/నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడనేను- అని విశ్వ మానవ కళ్యాణం కోసం గుర్రం జాషువా కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమీ ఇచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కుల పీడన అనుభవించినా దేశాన్ని నిందించ లేదు. తెలుగు జాతిని నిందించలేదు. జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి, రచయిత అయినా నేల విడిచి సాము చేయరు. జాషువా తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వ జనీనం చేశారు… – ఈ వాక్యాలను గుర్రం జాషువా గారి కవితాన్ని, వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాశారు.
విశ్వ మానవుడను నేను అని సగర్వంగా ప్రకటించుకున్న కవి జాషువా. ఆయన భావాలను గౌరవిస్తూ జనసేన సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అనే అంశాలు పొందు పరిచాను అని జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. జనసేనలో అంతర్గతంగా సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు, కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి.. షెడ్యూలు కులాల వారు ఆరోపణలు చేస్తే అదే కులాల వారితో ఆరోపణలు చేయించాలి అన్న బూర్జువా పంథాలోనే రాజకీయ పార్టీలు, రాజకీయ వాదులు మునిగి తేలుతున్నారు. కాలం మారుతోంది. నవతరం జెన్ జి ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయాలను నేటి తరం కోరుకుంటుంది. ఇందుకు తొలి అడుగుగా జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలి. అందుకే సేనా గళం పేరుతో పార్టీలో అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు.