పారదర్శకంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు
రాష్ట్ర కీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
అమరావతి : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ప్రతి దశను సాంకేతిక ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించామని అన్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ నుంచి పోస్టు ఎంపిక వరకు ఎటువంటి వ్యక్తిగత సంప్రదింపులు లేకుండానే ప్రక్రియ పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో శాప్ వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన వార్తలు, సందేహాల నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు, అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులను స్పష్టంగా తెలియ జేయాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం 2017లో అమలులోకి వచ్చిన క్రీడా విధానం 2022 వరకు కొనసాగిందని, అనంతరం రెండేళ్ల పాటు స్పోర్ట్స్ పాలసీ లేకపోయిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో జి.ఓ. నెం.18 ద్వారా సమగ్ర నూతన క్రీడా విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. “Sports for All” లక్ష్యంతో యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, మహిళా, పారాస్పోర్ట్స్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, ప్రతిభావంతుల గుర్తింపు, అంతర్జాతీయ స్థాయి ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాల విస్తరణ వంటి అంశాలను ఈ విధానంలో పొందు పరిచినట్లు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూలు, స్థానిక సంస్థల్లో క్రీడాకారులకు కల్పిస్తున్న రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచడం ఈ ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానంలో కీలక నిర్ణయమని పేర్కొన్నారు.