వేధిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరత

ఆందోళ‌న వ్య‌క్తం చేసిన గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్

అమ‌రావ‌తి : ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా వైద్య సేవ‌లు అందించేందుకు ఆరోగ్య సంక్ష‌ర‌ణ నిపుణుల కొర‌త తీవ్రంగా ఉంద‌న్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘నేషనల్ డిజిటల్ హెల్త్ ప్రోగ్రామ్’ గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడానికి ,పరిష్కారాలను అందించడానికి సహాయ పడుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే డాక్టర్-రోగి నిష్పత్తి చాలా తక్కువగా ఉందని చెప్పారు గ‌వ‌ర్న‌ర్. ఈ లోపం కేవలం వైద్యులకే పరిమితం కాకుండా, శిక్షణ పొందిన నర్సులు ,ఇతర సహాయక సిబ్బందిలో కూడా ఉందన్నారు.

దేశ వ్యాప్తంగా సమానమైన వైద్య సేవలను అందించడానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం, వనరులను వ్యూహాత్మకంగా కేటాయించడం చాలా అవసరం అని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యయం 2020-21 లో ₹3.2 లక్షల కోట్ల నుండి 2024-25 నాటికి ₹6.1 లక్షల కోట్లకు పెరిగింద‌న్నారు. ప్రభుత్వం ఆరోగ్య రంగంపై ఖర్చును పెంచడం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందన్నారు. ప్రజలు తమ సొంత డబ్బు నుండి నేరుగా చెల్లించే ఖర్చులు 2014-15 లో 62.6% ఉండగా, అది 2021-22 నాటికి 39.4% కి తగ్గిందని పేర్కొన్నారు గ‌వ‌ర్న‌ర్.

ప్రభుత్వ వ్యయం పెరగడానికి , ప్రజల సొంత ఖర్చులు తగ్గడానికి ప్రధాన కారణం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమలు చేయడం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇది సామాజిక భద్రత , ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. రోబోటిక్ సర్జరీలో సాధించిన పురోగతి వైద్య రంగాన్ని పూర్తిగా మారుస్తోందన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా శస్త్రచికిత్సా విధానాల రూపురేఖలను మారుస్తున్న ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని కొనియాడారు గ‌వ‌ర్న‌ర్. వైద్య విద్యార్థులు ఎదుర్కొనే విపరీతమైన మానసిక , విద్యా పరమైన ఒత్తిడిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని సూచించారు. వారి దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం ఇంట్లో ఒత్తిడి లేని, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!