రిసార్ట్ గా రిషికొండ ప్యాలెస్ : ఏపీ స‌బ్ క‌మిటీ

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న కోసం వినియోగించాలి

విశాఖ‌ప‌ట్నం : ఏపీ స‌ర్కార్ ప్ర‌త్యేకంగా నియ‌మించిన ఏమీ స‌బ్ క‌మిటీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖ‌ప‌ట్నంలో ఆనాటి వైసీపీ ప్ర‌భుత్వం భారీ ఖ‌ర్చుతో నిర్మించిన రిషికొండ ప్యాల‌స్ ను ఇక నుంచి రిసార్ట్ గా , ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న కోసం వినియోగించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. రుషికొండ భవనాలను క్షుణ్ణంగా పరిశీలించింది కేబినెట్ సబ్ కమిటీకి చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. భవనాల వినియోగంపై యాత్రినివాస్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ప్ర‌క‌టించారు మంత్రుల బృందం .

గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన రుషికొండ భవన సముదాయాన్ని (ప్యాలెస్) వందల కోట్ల ప్రజాధనం వృథా కాకుండా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని, ప్రజల సందర్శనార్థం వినియోగించాలని ప్రాథమిక నిర్ణయించినట్లు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. సుమారు రూ. 450 కోట్ల ప్రజాధనంతో, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఈ రాజ ప్రాసాదాన్ని కూల్చివేయకుండా, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా ‘హాస్పిటాలిటీ’ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది.వైజాగ్ వాసుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ప్రజల సందర్శనార్థం ఒక బ్లాక్‌ను కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్‌గా ఉంచేలా రూపొందించిన ఈ నివేదికను అంతిమ నిర్ణయం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కేబినెట్ ముందుకు త్వరలోనే తీసుకెళ్లనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.

రుషికొండ భవనాల (ప్యాలెస్) వినియోగం మరియు తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ పరిశీలనలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!