విశాఖపట్నం జిల్లా : మాజీ సీఎం వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణమన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ సబ్ కమిటీ ప్యాలెస్ ను సందర్శించింది. అనంతరం మీడియాతో మాట్లాడారు ఇందులో సభ్యుడిగా ఉన్న పయ్యావుల . వివిధ దశల్లో దాదాపు రూ.450 కోట్ల ప్రజాధనంతో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగిందన్నారు. ఈ భవనంలో కేవలం ఒక బాత్‌రూమ్ సైజే 21/21 ఫీట్లు (450 చదరపు అడుగులు) ఉందని తెలిపారు. గత ప్రభుత్వ అధినేత సామాన్యుడికి ఒక సెంట్ స్థలంలో 270 చదరపు అడుగుల ఇల్లు ఇస్తామని చెప్పి, తన బాత్‌రూమ్ కోసం ఇద్దరు సామాన్యులు ఉండే సైజులో కట్టించు కోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన సొంత డబ్బులతో ప్రైవేట్‌గా కట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజాధనంతో ఇంత విలాసమా అని ప్రశ్నించారు.
ఎంట్రీలో మార్బుల్ డిజైన్స్ కోసం చదరపు అడుగుకు రూ.6,450 ఖర్చు చేశారు. బాత్‌రూమ్ ధర అక్షరాలా రూ.12 లక్షలకు పైమాటే, అందులోని కమోడ్ విలువ రూ.4-5 లక్షలు ఉంటుంది. ఎన్నో స్టార్ హోటళ్లు చూశాను కానీ ఈ స్థాయి విలాసాలు ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు పయ్యావుల కేశవ్. హరిత రిసార్ట్ స్థానంలో కడుతున్నట్లు కోర్టులకు తప్పుడు పత్రాలు సమర్పించి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. . భవన నిర్మాణంలో భారీ డీవియేషన్స్ ఉన్నాయని, వేరే చోట కట్టారని కమిటీ నివేదికలో స్పష్టంగా ఉందన్నారు. దురదృష్టవశాత్తు ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసే నాటికి ఛైర్మన్ చనిపోయారు. బెటర్ ఐడియాలతో ఎవరైనా వస్తే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. గత ప్రభుత్వంలా నిబంధనలు ఉల్లంఘించే ఆలోచన మాకు లేదన్నారు పయ్యావుల కేశవ్. వృథా అయిన ప్రజాధనాన్ని ఎలా రికవరీ చేసుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. రుషికొండ కాంట్రాక్టర్‌కు జరిగింది రుషికొండ పనుల చెల్లింపులు కాదు, అవి ఆ కాంట్రాక్టర్ చేసిన వేరే ఇతర పనుల చెల్లింపులని గమనించాలి. తప్పులను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించదు అన్నారు.
