తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాస మూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై కొన్ని వందల సంవత్సరాల మునుపు ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 24వ తేదిన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేస్తారు. శ్రీవారి మూల మూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తిను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనుల వారిని ఆశీనులు చేస్తారు. తర్వాత శ్రీవారి మూల మూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేస్తారని పేర్కొన్నారు ఈవో.
అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా, అర్చక స్వాములు ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించనున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ఈవో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించచారు. అదేమిటంటే 24న శ్రీవారి ఆలయంలో కలశాభిషేకం ఉన్నప్పటికీ శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
