వ‌ర్షాల వేళ స‌మ‌న్యయంతో ప‌ని చేయాలి

ప‌లు సూచ‌న‌లు చేసిన జ‌యేష్ రంజ‌న్‌

హైద‌రాబాద్ : వ‌ర్షాల వేళ అన్ని శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీనియ‌ర్ ఐఏఎస్ జ‌యేష్ రంజ‌న్. హైద‌రాబాద్‌లో భారీ వర్షాలు – ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ఉన్నతాధికారుల కీలక సమావేశం సైబరాబాద్‌లోని పోలీసు క‌మిష‌న‌రేట్ కార్యాల‌యంలోని పబ్లిక్ సేఫ్టీ ఇంటెగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్లో జ‌రిగింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాల‌ని ఈ స‌మావేశంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప‌లు సూచ‌న‌లు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ర‌మేష్ రెడ్డి, సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న , సైబ‌రాబాద్ ప‌రిధిలోని డీసీపీలతో పాటు వివిధ శాఖ ఉన్న‌తాధికారులతో క‌ల‌సి జ‌యేష్ రంజ‌న్ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించారు. అనంత‌రం వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌పై స‌మీక్షించారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వ‌ద్ద తీసుకోవాల్సి జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు.

భారత వాతావరణ శాఖ (IMD) అంచనాలు , హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో ఎదురయ్యే పరిస్థితులపై చ‌ర్చించారు. నగర పరిధిలోని మైనర్, మీడియం, మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జయేష్ రంజన్ సూచించారు. వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వ‌ర్షాల స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు చేర్చి అవ‌స‌ర‌మైతే వ‌ర్కు ఫ్రం హోం ఉండేలా చూడాల‌న్నారు. పాఠ‌శాల‌ల‌న్నీ ఒకేసారి వ‌ద‌ల‌కుండా చూడాల‌ని పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి రోడ్లపై బ్రేక్‌డౌన్ అయ్యే వాహనాలను వీలైనంత వేగంగా తొలగించి ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన చోట్ల డ్రోన్లను వినియోగించి ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజా రవాణా వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు , ఇతర సంస్థలు స్కూల్ బస్సులు ఇతర సామూహిక రవాణా సదుపాయాలను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!