అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు, హస్త కళాకారులు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చట్టనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. విదేశాల్లో కూడా లేపాక్షి షోరూమ్ లు ఏర్పాటు చేయనున్నామన్నారు. అమరావతిలోని శాఖమూరులో పది ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల ప్రగతిపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ నినాదంతో, చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించారన్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారు. చేనేత రంగానికి పూర్వవైభం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టెక్స్ టైల్స్ అప్పారెల్ , గార్మెంట్స్ పాలసీ 2024-29 పాలసీ తీసుకొచ్చామన్నారు. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో టెక్స్ టైల్స్ రంగంలో రూ.10 వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షణతో పాటు 2 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాది విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ టెక్స్ టైల్స్ రంగంలో అయిదు ఒప్పందాలు జరిగాయని, రూ.4,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వాటిలో కొన్ని పరిశ్రమలకు భూములు, ఇతర మౌలిక సదుపాయలను కేటాయించామన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు అందజేస్తున్నామని, బడ్జెట్ లో త్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయించామని తెలిపారు. 2024-25లో 90 సంఘాలకు రూ.71.21 కోట్ల విలువైన నూలు సరఫరా చేశామన్నారు. 2025-26లో 109 సంఘాలకు రూ.175.20 కోట్ల విలువైన నూలు సరఫరా చేశామన్నారు. రెండేళ్లలో కలిపి రూ.246.41 కోట్ల విలువైన నూలు అందించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించామన్నారు. గత సంవత్సరం వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడెక్ట్ కింద ఏపీకి 10 అవార్డులు వస్తే, వాటిలో నాలుగు చేనేత రంగానికే వచ్చాయన్నారు.
