ఎరువుల వినియోగం కోసం ప్రత్యేకంగా యాప్

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్ల‌డి

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రైతుల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఎరువుల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో యూరియా, డీఏపీ ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయితే రైతులు యూరియాను అధికంగా వినియోగిస్తున్నారని, దీని వల్ల నేల సారవంతత దెబ్బ తినడంతో పాటు పంటలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. రైతులు యాప్ ద్వారా అవసరమైన ఎరువులను పొందుతూ యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు అచ్చెన్నాయుడు.

ఎరువుల సరఫరాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. గుంటూరు మిర్చికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే ఇటీవల చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని రసాయన అవశేషాల కారణంగా తిరిగి పంపించిన ఘటనను గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. అందువల్ల రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!