తిరుపతి : యోగా అన్నది ప్రతి ఒక్కరు తమ జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. ఆదివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా టిటిడి పరిపాలనా భవనం వెనుకనున్న పరేడ్ మైదానంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో ప్రసంగించారు. ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, ప్రశాంతతను పెంపొందించు కోవచ్చని అన్నారు. శ్రీవారి సేవలో నిత్యం నిమగ్నమై లక్షలాది మంది భక్తులకు సేవలందించే టిటిడి ఉద్యోగులు యోగను అలవర్చుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన జీవితం గడపడంతో పాటు వారి కుటుంబాల్లోనూ సంతోషం వెల్లి విరుస్తుందన్నారు.
గత 14 రోజులుగా క్రమశిక్షణతో యోగ సాధన చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఈవో ప్రత్యేకంగా అభినందించారు. తాను కూడా ఒకప్పుడు బలవంతంగా యోగ ప్రారంభించినప్పటికీ, అది క్రమంగా అలవాటై ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారి తీసిందని తన అనుభవాన్ని పంచుకున్నారు. టిటిడి జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, గతంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఒక రోజు మాత్రమే నిర్వహించేవారని అన్నారు. ఈవో ఆదేశాల మేరకు జూన్ 7 నుండి 21 వరకు 14 రోజుల పాటు టిటిడి సంస్థల్లో విస్తృత స్థాయిలో యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఉద్యోగులందరూ ఇదే స్ఫూర్తితో యోగను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
‘ధ్యాన మూలమిదం జగత్’ సీడీ, పుస్తకావిష్కరణ, స్విమ్స్ వారు రూపొందించిన బ్రోచర్ ను టిటిడి ఈవో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముందు పూజా కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలనతో యోగ దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం “ధ్యాన మూలమిదం జగత్”, “యోగ – ఒక పరిచయం” సీడీ , పుస్తకాన్ని ఈవో ఆవిష్కరించారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన యోగాసనాలను అధికారులు, సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా అభ్యసించారు. గత 14 రోజుల యోగ శిక్షణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఈవో ప్రశంసా పత్రాలు అందజేశారు. టిటిడి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇన్చార్జి కార్యదర్శి డా. మేడసాని మోహన్, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, స్విమ్స్ డైరెక్టర్ డా ఆర్వీ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
