నీట్ యయుజి 2026 రీ టెస్టుకు 8.5 శాతం గైర్హాజర్
దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నీట్ యుజి 2026 రీ టెస్టు పూర్తయింది. ఈ టెస్టుకు 8.5 శాతం విద్యార్థులు గైర్హాజర్ అయ్యారు. మరో వైపు చిరునామా గందరగోళంతో ముగ్గురు పరీక్షకు దూరం అయ్యారు. ఇక పరీక్ష పరంగా చూస్తే మెడిసిన్ , బీడీఎస్ అభ్యర్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా అనిపించగా, బయాలజీ విభాగం సులభంగా ఉంది. పేపర్ లీక్ కారణంగా రద్దయిన మే నెల నాటి నీట్ పరీక్షతో పోలిస్తే, ఈ రీ-టెస్ట్ ప్రశ్నలు మరింత కఠినంగా ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. మొత్తం 73,059 మంది నమోదిత విద్యార్థులలో 89 శాతం మంది నీట్ యుజి రీ టెస్టుకు హాజరయ్యారు. గత మే 3వ తేదీన జరిగిన నీట్ టెస్టు పరీక్షతో పోలిస్తే రీ టెస్ట్ హాజరు శాతం 8.55 తక్కువగా నమోదైంది.
ఇందులో, రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లపై ముద్రించిన పరీక్షా కేంద్రం చిరునామా విషయంలో తలెత్తిన గందరగోళం కారణంగా పరీక్షకు హాజరు కాలేక పోయారు. హాల్ టిక్కెట్లపై జిల్లా పరిషత్ హై స్కూల్ శివరాంపల్లి అని ఉన్నప్పటికీ, లొకేషన్ (ప్రాంతం) వివరాల్లో ‘హయత్ నగర్’ అని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు తప్పు కేంద్రానికి వెళ్లగా, అక్కడ అధికారులు వారిని అనుమతించలేదు. రీ-టెస్ట్‌కు హాజరైన విద్యార్థులు, పేపర్ లీక్ కారణంగా రద్దయిన మే నెల నాటి నీట్ పరీక్షతో పోలిస్తే ప్రశ్నలు మరింత కఠినంగా ఉన్నాయని ఆవేదన చెందారు . ఇక నీట్ పరీక్ష విషయానికి వస్తే దాదాపు దేశ వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.