మెట్రో రుణ జాప్యం రోజుకు రూ. 2.5 కోట్ల భారం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. మెట్రో రుణ జాప్యంతో రోజుకు రూ. 2.5 కోట్ల భారం ప‌డుతుంద‌న్నారు. మెట్రో రెండోద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర నుంచి రూ. 13,527 కోట్ల నిధులు రావాల్సి ఉంద‌ని, కానీ కావాల‌ని జాప్యం చేస్తున్నారని వాపోయారు. అయితే ఈ నిధులు హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రావాల్సి ఉంద‌న్నారు సీఎం. ఈ జాప్యం కార‌ణంగా రాష్ట్ర ప్రభుత్వంపై రోజుకు దాదాపు భారీ ఎత్తున వ‌డ్డీ భారం ప‌డుతోంద‌ని వాపోయారు. ఇవాళ ఆయ‌న నిధుల విడుద‌ల‌కు సంబంధించి ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.

ఐఆర్ఎఫ్‌సీ రుణాన్ని త్వరగా విడుదల చేయించడం , కేంద్రంతో పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై చర్చించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ముడిపడి ఉన్న రాయదుర్గ్ భూమి వేలం వివాదం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ముంబై నుండి ఢిల్లీకి చేరుకున్నారని, జూన్ 23 వరకు అక్కడే ఉంటారని సమాచారం. ఐఆర్ఎఫ్‌సీ రుణాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో భేటీకి ముఖ్యమంత్రి సమయం కోరారు.

గోదావరి నదిపై పునరుద్ధరించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకారం కోరేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసేందుకు ఆయన ప్రయత్నించారని సమాచారం. అయితే, ఫడ్నవీస్ ముందస్తు కార్యక్రమాల వల్ల ఆ భేటీ జరగలేదు.

Leave A Reply

Your Email Id will not be published!