వైద్యారోగ్య రంగ సంస్థ‌లు మ‌రిన్ని రావాలి : సీఎం

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు

హైద‌రాబాద్ : వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ స్పూర్తితో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అంకురార్పణ జరిగింది. బసవ తారకం కాన్సర్ ఆస్పత్రి ప్రస్థానం వెనుక కథ ఉంది. మా అత్తగారికి సోకిన క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం ఆ సమయంలో ఎక్కడా ఆస్పత్రి లేని పరిస్థితి. ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లోనే క్యాన్సర్ ఆస్పత్రులు ఉండేవి. ఆగస్టు సంక్షోభం సమయంలోనే ఆమె క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందక ఇక ఎవరూ చనిపోకూడదనే ఆలోచనతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఎన్టీఆర్ విజన్ తో పాటు పేదలకు వైద్య చికిత్స అందించాలన్న సంకల్పంతో ఆస్పత్రి నిర్మాణం చేశాం. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీగా, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు లాంటి ప్రముఖ వైద్యులతో ఈ ఆస్పత్రి ప్రారంభమైంది.

తొలుత 100 పడకల ఆస్పత్రిగా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించాం. మొక్కగా నాటిన ఈ ఆస్పత్రి ఇప్పుడు మహా వృక్షంగా ఎదిగింది. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో త్యాగాలు ఉన్నాయి. వివిధ సవాళ్లను అధిగమించి ఈ సంస్థకు బాలకృష్ణ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ అందిస్తున్న సేవలు అన్ స్టాపబుల్. ఎవర్ గ్రీన్ హీరోగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా బసవతారకం ఆస్పత్రికి వెళ్లి రోగులను పరామర్శిస్తూ వారికి సాంత్వన కలిగిస్తున్నారు. లాభాపేక్ష లేని సంస్థగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని నడుపుతున్నారు. 650 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చెందిన ఈ ఆస్పత్రి ప్రస్తుతం ఏపీ, తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని క్యాన్సర్ బాధితులకు సేవలు అందిస్తోంది. 8 వేలకు పైగా శస్త్ర చికిత్సలు, రోజూ 22 మందికి ఆపరేషన్లు చేస్తూ బసవతారకం ఆస్పత్రి పేదవర్గాలకు అండగా నిలుస్తోంది. ఏడాదికి 3 లక్షల పైచిలుకు మంది రోగులకు ఈ ఆస్పత్రి ద్వారా చికిత్స పొందుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!