అమరావతి : రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఖరీఫ్-2026 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎరువుల లభ్యత, పంపిణీ, నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వివిధ ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్ల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు అవసరమైన మేరకు మాత్రమే కాకుండా, అవసరానికి మించి కూడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా యూరియా సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా అధికారులు, కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులు విక్రయించే ధోరణిని వెంటనే నిలిపి వేయాలని మంత్రి స్పష్టం చేశారు.
రైతులకు అవసరమైన ఎరువులను మాత్రమే అందించాలని, అనవసరమైన ఉత్పత్తులను బలవంతంగా విక్రయించడం సహించబోమని హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, సంబంధిత కంపెనీలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ ధరలకు యూరియా విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎరువుల డీలర్లు ఎంఆర్పీ ధరకే విక్రయాలు జరపాలని ఆదేశించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
