విజయవాడ : రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆంధ్రప్రదేశ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు 45వ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా కార్మికులకు చేర వేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సెక్రటరీ ఎంబీ శేషగిరి బాబు, అడిషనల్ సెక్రటరీ మరియు కమిషనర్ గంధం చంద్రుడు , వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్,వెల్ఫేర్ బోర్డు సభ్యులు వెంకట రమణి, ఆరా మహేశ్వరి, అరవరాజు నేలపాల, గదుల సాయిబాబు, బి విశ్వనాథ నాయుడు,డి. నారపరెడ్డి, చింత రేణుక రాజు, నల్లగొప్పుల వెంకట చలపతిరావు, పిడుగు వెంకటరెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
