జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : అచ్చెన్నాయుడు

రైతు వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్

అమరావతి : రైతుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్, తన ఐదేళ్ల పాలనలో రైతులను అన్ని విధాలుగా నష్టపరిచి ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని చూసి ఓర్వలేక అసత్యాలు, అర్థసత్యాలతో సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ చేసిన తాజా ట్వీట్ అబద్ధాల అడ్డాగా మారిందని, తన పాలనలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, ఆత్మహత్యలు, పంటల నష్టపరిహారం కోసం పడిన ఇబ్బందులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు సంక్షేమంపై జగన్ చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని, మోసాల చరిత్రను మర్చిపోయి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.588 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 2019–24 మధ్య రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ప్రజలను అప్పుల భారంలో ముంచిన జగన్‌కు చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కానీ, నైతిక అర్హత కానీ లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఐదేళ్ల పాటు ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక బటన్ పాలన నడిపిన జగన్ ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకత్వంపై విమర్శలు చేయడం ఆయన రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

Leave A Reply

Your Email Id will not be published!