హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. దీనిపై ఆరా తీశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సర్ ప్రక్రియ ను నిశితంగా పరిశీలీంచాలని, ఇందుకు సంబంధించి 10 రోజుల గడువు విధించారు. ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ/పరిశీలన ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ఆదేశించారు. సర్ కార్యక్రమాన్ని అమలు చేయడంలో పార్టీ ఆదేశాలను పాటించని నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం పార్టీ నాయకులతో సర్ పై జరిగిన జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆయన, ఓటర్ల జాబితా నుండి నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబడే ప్రమాదం ఉన్నందున ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
సర్ అనేది చాలా కీలకమైన అంశం. కొందరు నాయకులు దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అవగాహన సమావేశాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా వారీగా నివేదికలు అందాయని, పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. సర్ పై మరిన్ని అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి, ఆ సమావేశాలను విజయవంతం చేసే బాధ్యతను ఇన్‌ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. సర్ ప్రక్రియలో పేదల ఓటు హక్కుకు భంగం కలగకుండా చూడాలని ఆయన నొక్కి చెప్పారు. పేదలు తమ ఓటు హక్కును కోల్పోతే, తద్వారా ఆధార్, రేషన్ కార్డులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పార్టీ ఆదేశాలను నాయకులందరూ కచ్చితంగా పాటించాలని, ఒకవేళ ఇన్‌ఛార్జ్‌లు పార్టీ సూచనలను అమలు చేయడంలో విఫలమైతే వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని సీఎం తెలిపారు
