హైదరాబాద్ : కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని తెలంగాణ కాలేజీ లెక్చరర్ల సంఘం కోరింది. ఈ మేరకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి కి విన్నవిస్తూ విజ్ఞాపన పత్రాన్ని అందించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలలో విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి అత్యంత మెరుగైన, నాణ్యవంతమైన భోజనం అందించాలని కోరింది. అంతే కాకుండా 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల పెండింగ్ సమస్యలను , ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఆ సంఘం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆన్లైన్ ద్వారా వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది.
ప్రస్తుతం ఈ పథకం పైలట్ ప్రాతిపదికన మాత్రమే అమలు చేయబడుతోందని తెలిపింది. కళాశాలలు పునఃప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ, ఈ పథకం కేవలం కొన్ని కళాశాలల్లో మాత్రమే అమలులో ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వాస్కుల శ్రీనివాస్ , రాష్ట్ర కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ పేర్కొన్నారు. అలాగే, 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల పెండింగ్ సమస్యలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చినప్పటికీ, ఇంక్రిమెంట్లు , ఇతర అంశాలకు సంబంధించిన అమలు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు.
