అపూర్వ ఆద‌ర‌ణ అనూహ్య స్పంద‌న

శ్రీ‌వారి సేవ కోసం వైద్య నిపుణుల రాక

తిరుపతి : శ్రీవారి సేవ ప్రతి భక్తుడి జీవితంలో లభించే మహాభాగ్యమని, అదే స్ఫూర్తితో టీటీడీ ప్రారంభించిన “శ్రీవారి వైద్యసేవ” కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోని నిపుణ వైద్యుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. ఎ. శరత్ తెలిపారు. ఎస్వీ గో సంరక్షణశాలలో జరుగుతున్న వైద్య సేవలను ఆయన నిపుణ వైద్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడారు. భక్తుల సేవలో విజయవంతంగా కొనసాగుతున్న శ్రీవారి సేవ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాల‌ని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వైద్య, పశువైద్య, ఇతర వృత్తి నిపుణులను స్వచ్ఛంద సేవలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో శ్రీవారి వైద్యసేవ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మార్గదర్శకత్వంలో స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద కళాశాల, గోశాల, వైద్య విభాగం తదితర సంస్థల అధిపతులతో పలు సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి సమగ్ర కార్యాచరణ రూపొందించామ‌న్నారు. అనంతరం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మూడు నెలల ట్రయల్ రన్‌గా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

జూన్ 20 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే 488 మంది స్పెషలిస్టు వైద్యులు, వివిధ విభాగాల నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు జేఈవో శ‌రత్. స్పెషలిస్టు వైద్యులకు మూడు రోజుల సేవా అవకాశం, ఇతర వైద్యులకు ఏడు రోజుల సేవా వ్యవధిని కల్పించామని చెప్పారు. అంతే కాకుండా, ఆసక్తి ఉన్నవారు నెల రోజులు, ఆరు నెలలు లేదా ఏడాది పాటు కూడా సేవలందించే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాధిపతుల ద్వారా సేవా స్లాట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!