అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం పార్టీ పరంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్గా డాక్టర్ రాజాను నియమించారు. అధికారికంగా ఈ విషయాన్ని టీడీపీ వెల్లడించింది. 2029 ఎన్నికలకు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల నెట్వర్క్ను బలోపేతం చేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తుండగా, నారా లోకేష్ కూడా దీనికి మద్దతు తెలిపారు. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా తమ ఉనికిని విస్తరించే కీలక చర్యలో భాగంగా, తెలుగు దేశం పార్టీ (టీడీపీ) డాక్టర్ రాజాను ‘గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్’గా నియమించింది. పార్టీ పట్ల డాక్టర్ రాజాకు ఉన్న దీర్ఘకాలిక సేవాభావం ,అంకితభావాన్ని గుర్తించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఈ నియామకం చేపట్టారు.
తనపై నమ్మకం ఉంచినందుకు చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్లకు డాక్టర్ రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకానికి నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలను బలోపేతం చేయడం, సమర్థవంతంగా సమన్వయం చేయడం , శక్తివంతమైన గ్లోబల్ నెట్వర్క్ను నిర్మించడం కోసం నేను కృషి చేస్తాను అని ఆయన అన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి , యువత సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడేలా ప్రవాసాంధ్రుల నైపుణ్యం , గ్లోబల్ నెట్వర్క్లను వినియోగించు కోవడమే తన ప్రాధాన్యత అని డాక్టర్ రాజా నొక్కి చెప్పారు.
పాలన, అభివృద్ధికి వినూత్నమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన పరిష్కారాలను తీసుకు రావడానికి, కృత్రిమ మేధ ఆధారిత ఈ యుగంలో యువ నిపుణులు , పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేయడం ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. కాగా అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆసియా , ఆఫ్రికా దేశాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ నియామకాన్ని స్వాగతించారు.
