ఉండవల్లి రైతులపై ఖాకీల దౌర్జన్యం దారుణం : జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకంపై ఆగ్రహం
తాడేపల్లి గూడెం : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి, భయ భ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు జగన్ రెడ్డి.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని అన్నారు. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారమని, ఆ భూమితోనే పిల్లలను చదివించు కుంటున్నారని తెలిపారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారని, అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట తప్ప మరోటి కాదన్నారు. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు జగన్ రెడ్డి.
