కడపలో కరోనాకు అడ్డుకట్ట వేయండి : ఎస్. స‌విత

రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి

అమరావతి : కడప జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ ను, డీఎంహెచ్ వో రవిబాబుకు స్ప‌ష్టం చేశారు. కడపలో ఎనిమిది కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా ఇద్దరు మృతి చెందడంపై సవిత ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, ఆసుపత్రుల వద్ద మాస్క్ లు వాడకం తప్పనిసరి చేయాలన్నారు. జ్వరం, దగ్గు, ఇతర కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్ వార్డుకు తరలించాలన్నారు. కలెక్టర్ శ్రీధర్, డీఎంహెచ్ వో రవిబాబు మాట్లాడుతూ, ఎనిమిది కరోనా కేసులు మినహా కొత్తగా కేసులు నమోదు కాలేదన్నారు. ప్రస్తుత కరోనా వెరియంట్ వ్యాప్తిపై శాంపిళ్లను పూణే ల్యాబ్ కు పంపామన్నారు.

ప్రస్తుతం నమోదైన కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందుతుందా… నెమ్మదిగా సోకుతుందా..? అనేది ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులో వెల్లడవుతుందన్నారు. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టామని, బ్లీచింగ్ వెదజల్లామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కరోనా నమోదైన కుటుంబాల్లో సభ్యులకు కూడా తక్షణమే పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ నమోదయితే వారిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించాలని ఆదేశించారు. నెగిటివ్ వస్తే… కొద్ది రోజుల పాటు వారి ఇళ్లల్లోనే ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపారు. మరో మరణం సంభవించకుండా, ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఉన్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మేరకు కోవిడ్-19 టీకాలు అందుబాటులో ఉంచాలని మంత్రి సవిత ఫోన్లో స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!