అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమం చేపట్టాం అన్నారు. మహిళలకు పనిచేసే చోట్ల చైల్డ్ కేర్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యువతతో పాటు పెద్ద వాళ్లు కూడా నిరంతరం సమాజ హితం కోసం ఆలోచన చేస్తూ ఆస్తిగా తయారు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో ప్రభుత్వం క్షేమం అనే కార్యక్రమాన్ని తీసుకు రావాలని ఆలోచన చేస్తోందన్నారు సీఎం. నిరంతరం నైపుణ్యాలను అంది పుచ్చుకుంటూనే ఉండాలని స్పష్టం చేశారు. అప్పుడే నాణ్యమైన వర్క్ ఫోర్స్ దేశానికి అందుతుందన్నారు. టెక్నాలజీ, నాలెడ్జి, అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దేశంలో చాలా చోట్ల నాయకత్వ లేమి సమస్య ఉందని పేర్కొన్నారు . యువత అవకాశాలను అందిపుచ్చు కోవాలని కోరారు.
అంగన్వాడీల నుంచే పిల్లల ఆరోగ్యంతో పాటు పౌష్టిక ఆహారం అందిస్తున్నాం అన్నారు. పాఠశాలల్లో విద్య అందించేందుకు తల్లికి వందనం కింద ప్రతీ ఒక్కరికీ రూ.15వేల చొప్పున ఇస్తున్నాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. 2047 నాటికి మన తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేర్చాలన్నదే నా సంకల్పం అని ప్రకటించారు. జనాభా లేకపోతే మనం చేసుకున్న అభివృద్ధి లక్ష్యాలను సాధించలేం అన్నారు. 15 శాతం వృద్ధి రేటుతో లక్ష్యాల మేరకు ముందుకు వెళ్తే 2040 నాటికే స్వర్ణాంధ్ర సాధించ గలుగుతాం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలతో సంప్రదించి పిల్లలే సంపద కార్యక్రమాన్ని చేపడతాం అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఒక రియాలిటీ అని గుర్తించాలని పేర్కొన్నారు.
