కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ చర్యలు చేపడతాం
కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ చర్యలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పర్యవేక్షణలో వచ్చిన సిఫార్సులు, జల్ శక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు చేపడతామని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, డిజైన్లు, సంరక్షణలో లోపాలు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసి నీటిని నిల్వ చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉన్నందున ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియను నిలిపి వేసినట్లు పేర్కొన్నారు సీఎం. బోధి పెవిలియన్లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ – నీటిని నిల్వ చేయడం , ఎత్తిపోయడం సాధ్యం కాని మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజీల పరిస్థితులపై ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలను ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు.కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి, జల్ శక్తి మంత్రిత్వ శాఖ జూన్ 30న ఒక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని నియమించిందని చెప్పారు సీఎం. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజీల డిజైన్, పునరుద్ధరణ పనులు ఆ కమిటీ సిఫార్సుల మేరకే జరగాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఈ సాంకేతిక పర్యవేక్షణ కమిటీలో ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు చైర్మన్గా ఉంటారు. అలాగే CWC డైరెక్టర్ (డిజైన్స్ – BCD), CWC డైరెక్టర్ (డిజైన్ – గేట్స్), ఎస్ఈ స్థాయికి తగ్గని ఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధి ఒకరు, ఎస్ఈ స్థాయికి తగ్గని CWPARS ఇంజనీర్ ఒకరు , ఎస్ఈ స్థాయికి తగ్గని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ముగ్గురు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీని నియమించేటప్పుడు, తెలంగాణ ప్రభుత్వ నిపుణులు, ఈ రంగంలోని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, ఇతర సంబంధిత నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని జల్ శక్తి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
