శ్రీసత్యసాయి జిల్లా : ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పది కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. కార్పొరేట్ విద్యా సంస్థల సీట్ల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. తమ ఇళ్ల ముందు రోడ్లు కూడా వేసుకోని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి మంత్రి సవిత పాల్గోని ప్రసంగించారు. నసన్నకోట బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుకు దివంగత నాయకులు పరిటాల రవి తన సొంత భూమి పది ఎకరాలను అందజేశారన్నారు.
పరిటా రవి సేవా స్పూర్తి ఎందరికో మార్గదర్శకమన్నారు ఎస్. సవిత. నసన్నకోట బీసీ బాలికల గురుకుల పాఠశాలను తన సొంత నిధులు ఎమ్మెల్యే పరిటాల సునీత అభివృద్ధి చేస్తున్నారన్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు మంత్రి సవిత. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, ఆహారం, రక్షణ కల్పిస్తోందన్నారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్టాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తరగతి గదులు, విశ్రాంతి గదుల్లో దోమలు చొరబడకుండా దోమ తెరలు ఏర్పాటు చేశామన్నారు. రుచికరమైన భోజనం అందించేలా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
