అమరావతి : గత రెండేళ్లలో మొత్తం సీజన్‌లో టమాటా ధరలు కిలోకు రూ.3 నుంచి రూ.6 మధ్యే ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారం కూడా వాస్తవాలను వక్రీకరించేదేనని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 2024, 2025 సంవత్సరాల్లో పలు నెలల్లో టమాటా ధరలు ఈ స్థాయికి మించి గణనీయంగా నమోదయ్యాయని వివరించారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి ప్రచారం చేయకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపడుతున్న మార్కెట్ జోక్య చర్యల్లో భాగంగా ఈ ఏడాది జూలై 5 నుంచి ఇప్పటి వరకు సుమారు 261 టన్నుల టమాటాను సేకరించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సేకరించిన టమాటాలను రాష్ట్రంలోని రైతు బజార్లలో ‘నో లాస్–నో ప్రాఫిట్’ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
రైతుల కష్టాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించు కోవడం కాకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపడంపై దృష్టి పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు. నిరాధార ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం కాదని, వారికి అండగా నిలిచి వారి ప్రయోజనాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
