అమరావతి : రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆలూరులో జరిగిన కార్యక్రమంలో స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును అందించారు. అనంతరం సంజీవని కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు చంద్రబాబు నాయుడు. సీఎం అంటే సెక్రటేరీయేట్టులో ఉండే చీఫ్ మినిస్టరే కాదని, ప్రజలతో ఉండే కామన్ మ్యాన్ అనేది నా భావన అని అన్నారు. అందుకే నిత్యం ప్రజలతోనే ఉంటున్నానని చెప్పారు సీఎం.
నిత్యం ప్రజలతో ఉంటేనే ఉత్సాహంగా ఉంటానని పేర్కొన్నారు. నెలలో నాలుగు కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా విని అందరి భవిష్యత్తు కోసం ప్రజా పాలసీలు తీసుకు వస్తున్నానని ప్రకటించారు సీఎం. దాంట్లో భాగంగానే ప్రతి నెల సంజీవని కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును తెస్తున్నామన్నారు. ప్రతీ కుటుంబం, విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. సంజీవని ప్రాజెక్టును ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం అని ప్రకటించారు సీఎం.
ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తు్న్నాం అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్య రక్షణే ‘సంజీవని’ విధానం అని తెలిపారు.
