అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక అప్ డేట్ ఇచ్చారు. సంజీవిని కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికీ త్వరలో డిజిటల్ ఆరోగ్య కార్డులు అందజేస్తామన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. మంచి ఆహార అలవాట్లు ఉండాలి. యోగా, ధ్యానం, వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు. జీవనశైలి మారాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సంజీవని వంటి ప్రాజెక్టును తెచ్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు సీఎం. ప్రజారోగ్యంతో పాటు.. ప్రజా సంక్షేమం కోసం వివిధ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సంక్షేమం కోసం ప్రతీ నెలా మొదటి తేదీన పెన్షన్ ఇచ్చి పేదలకు ఆర్ధిక భద్రత ఇస్తున్నాం అన్నారు. ప్రతీ రైతుకూ అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల ఆర్ధిక సాయం అందించాం అని వెల్లడించారు.
విద్యార్ధుల భవితకు భరోసా ఇస్తూ తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బులు జమ చేస్తున్నాం అని చెప్పారు సీఎం. మహిళలకు సాధికారిత కల్పించేలా స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నామన్నారు. వంట కష్టాలు తీర్చేలా దీపం-2.0 అమలు చేస్తున్నాం… గ్యాస్ సిలిండర్ రాయితీని ఖాతాలకు వేసేలా చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు . ప్రతీ ఇంటికీ సౌర విద్యుత్ ద్వారా వెలుగులు నింపేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షాన వారి జీవన ప్రమాణాలు పెంచేలా పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే గత పాలకులు సహించలేక పోయారని మండిపడ్డారు. గత పాలకులు ప్రజల ఆస్తుల్ని 22 ఏ కింద పెట్టేసి వాటిని కాజేసేందుకు ప్రయత్నించారని, అందుకే రీసర్వే ప్రక్రియ ద్వారా రికార్డులను బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రత కల్పిస్తు్న్నాం అన్నారు.
