నామినేటెడ్ పదవుల్లో 60 శాతం పార్టీ సీనియర్లకే

మాజీ మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి నేతలకు ప్రాధాన్యత

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ప‌వ‌ర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇంకా భ‌ర్తీ చేయ‌కుండా మిగిలి ఉన్న నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తోంది. హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) డైరెక్టర్లు, చైర్మన్ల నియామకాలు, అలాగే వివిధ నియోజకవర్గ, జిల్లా , రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించి, తగిన మార్గదర్శకాలను ఖరారు చేశారు.ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు , నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ నేతలతో సమావేశమై, సమన్వయం చేసుకుంటూ ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ముఖ్యంగా, నామినేటెడ్ పదవులలో 60 శాతం వాటాను మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కమిటీలలో పనిచేసిన వారు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ స్థాయి సీనియర్ నేతలకు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే, ఈ నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు , మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వ‌నున్నారు. అన్ని స్థాయిల్లో సంప్రదింపులు పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేసిన తర్వాత, ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు సంయుక్తంగా తుది నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Leave A Reply

Your Email Id will not be published!