అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నేతన్నలను ఆదుకునేందుకు గాను ఇప్పటికే పలు పథకాలను తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు తీపి కబురు చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆగస్టు 7న ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించనన్నారు. సోమవారం సచివాలయంలో చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జౌళి) ఆర్.పి. సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. అర్హులైన చేనేత కార్మికులకు ఏటా రూ. 25,000 ఆర్థిక సహాయం అందించే ‘నేతన్న సేవలో’ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న బాపట్ల జిల్లాలోని చీరాలలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని మంత్రి ప్రకటించారు.
చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగు పరచడానికి , వారు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందని మంత్రి తెలిపారు. నేతన్నల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలను అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. 50 ఏళ్లు పైబడిన అర్హులైన నేతన్నలకు ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛను పథకం వర్తింపజేస్తుండగా, చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు , పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పొదుపు నిధి (thrift fund) మద్దతు మరియు ముద్రా రుణాలు వంటి ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రజల ప్రయోజనం కోసం అదనపు సంక్షేమ కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని సవిత తెలిపారు. ఆగస్టు 7 నుండి ఆర్థిక సహాయం పంపిణీ చేసేందుకు వీలుగా, అర్హులైన నేతన్నలందరూ ఆగస్టు 5 సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె కోరారు.
