అమెరికా : అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం అని స్పష్టం చేశారు. పారిశ్రామిక భూమి లభ్యత, నైపుణ్యం గల మానవ వనరులు, నమ్మకమైన విద్యుత్ సరఫరా , ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి కీలక బలాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రవాస తెలుగువారు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు , బే ఏరియాకు చెందిన నిపుణులతో ముచ్చటించి, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్య స్థానాలలో ఒకటిగా తెలంగాణను నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తయారీ, ఐటీ, లైఫ్ సైన్సెస్, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాలలో పెట్టుబడుల కోసం పారిశ్రామిక కారిడార్లు, పార్కులలో తగినంత భూమిని అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలను తీర్చగల నైపుణ్యం గల శ్రామిక శక్తిని సృష్టించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఇతర విద్యా, సాంకేతిక సంస్థలను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. పరిశ్రమలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందించే సామర్థ్యం తెలంగాణకు ఉందని, సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తితో పాటు పునరుత్పాదక ఇంధన రంగంలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోందని భట్టి అన్నారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు లభించేలా ప్రభుత్వం సింగిల్-విండో విధానాన్ని అమలు చేస్తోందన్నారు. అనుమతులలో జాప్యాన్ని తొలగించడం ద్వారా పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని చెప్పారు. .
