ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి
కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఎంపీలు విన్నపం
న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినతి పత్రం అందించారు. మంగళ వారం ఢిల్లీలో ప్రహ్లాద్ జోషితో ఎంపీలు భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చూడాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రానికి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదనలు పంపారని ఎంపీలు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు మార్గం సుగమం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన అని వివరించారు. నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం ఉచితంగా భూమి, తాత్కాలిక భవనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి స్పష్టం చశారు. కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి, ఏపీ ప్రభుత్వంతోపాటు ఎంపీలతో ఉమ్మడి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి సమీక్ష నిర్వహిస్తే త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటు చేయడం వల్ల ‘ఎన్ఈపీ-2020’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలు సాకారమవుతాయని చెప్పారు.
