విజయవాడ : కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనుదామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు దేశం అంతా ఒక్కటే పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరూ కలిసి జరుపుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. ఈ రోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరి గుండె చప్పుడు. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడ విద్యార్థులను చూసిన తర్వాత నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అనగానే స్కూల్ లో హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి క్లాస్ రూమ్స్, స్కూల్ ని డెకరేట్ చేసేవాళ్లం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవి.
జనగణమన అంటూ జాతీయ గీతం పాడుతూ.. జాతీయ జెండా ఎగరడం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈ రోజు మళ్లీ నాకు గుర్తొచ్చింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైనే కాదు.. ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతోందన్నారు నారా లోకేష్. అహింస ఆయుధంగా స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ. కత్తిపట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీర మహిళ రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్. నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అంటూ యువత దేశం కోసం పోరాడేలా చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ. లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే ఎగురవేయడం నాకు దక్కిన గౌరవం. బ్రిటీష్ వాళ్ల తుపాకీకి ఎదురు నిలబడిన ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. రంపా రెబలియన్ పేరుతో బ్రిటీష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆగష్టు 15 కేవలం ఒక తేదీ కాదు.. మన చరిత్రను గుర్తుచేసే రోజు. మన భవిష్యత్ నిర్మించిన రోజు. మూడు రంగుల జెండా మన ఆత్మగౌరవం అన్నారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉంటే మనకి కొండంత బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం కృష్ణా నది. మన సాగు, తాగునీటికి వరం ప్రకాశం బ్యారేజీ. మన బెజవాడ విద్య, కళలకు నిజమైన రాజధాని. ఉండవల్లి గుహలు మన చరిత్ర. కొండపల్లి బొమ్మలు మన కళ. గడిచిన రెండేళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాను. కానీ ఈ సంవత్సరం మీ అందరికీ అన్నగారు.. నాకు మాత్రమే తాతగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఉన్న ఎన్టీఆర్ జిల్లా వేడుకల్లో పాల్గొనడం నాకు దక్కిన అరుదైన గౌరవం అని అన్నారు. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పాను. రెండేళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారు. కరిక్యులమ్ మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో స్టూడెంట్ కిట్స్ ఇస్తున్నాం. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. పాఠశాలల్లో రాజకీయాలకు తావులేకుండా చేశాం. పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి పాఠశాలల వరకు ఎక్కడా నా ఫోటో లేదు, సీఎం ఫోటో లేదు. దేశ చరిత్రలో మొదటిసారి పదో తరగతి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో ప్రకటన ఇచ్చాం. చాగంటి కోటేశ్వరరావుని సలహాదారుగా నియమించి విలువలు నేర్పిస్తున్నాం. మహిళలను గౌరవించడం నేర్పిస్తున్నాం. అమ్మకు చెప్పలేని పని ఏమీ చేయొద్దు అని. వినడానికి సింపుల్.. కానీ చాలా పవర్ ఫుల్. మహిళలను గౌరవిస్తేనే సమాజం బాగుంటుందని బలంగా నమ్ముతాను అని అన్నారు నారా లోకేష్.
