న్యూఢిల్లీ : బాలికల పారిశుధ్యంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతంలో విచారించిన ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు తగిన పారిశుధ్య సౌకర్యాలు లేవని పేర్కొంటూ దాఖలైన ఈ వ్యాజ్యాన్ని, రుతుక్రమ ఆరోగ్యాన్ని జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా గుర్తించిన ధర్మాసనం ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చి , వి. మోహనలతో కూడిన ధర్మాసనం కేంద్రం , వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సంబంధిత అధికారులపై రీపక్ కన్సల్ దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై సుప్రీం కోర్టు ఇప్పటికే సమగ్ర తీర్పును వెలువరించిందని ప్రధాన న్యాయమూర్తి గుర్తుచేస్తూ, ఆ ముందస్తు తీర్పు, ఆదేశాలను పరిశీలించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని కోరారు. 98,000కు పైగా పాఠశాలల్లో బాలికల కోసం వినియోగంలో ఉన్న మరుగుదొడ్లు లేవని పేర్కొన్న నీతి ఆయోగ్ నివేదికను న్యాయవాది ప్రస్తావించారు.
ప్రస్తుత పిటిషన్ను ముందుకు తీసుకెళ్లే ముందు, కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులోని ఆదేశాలను పరిశీలిస్తానని ఆయన తెలిపారు. జనవరి 30న జస్టిస్ జె.బి. పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే దీనిపై సమగ్ర తీర్పు ఇచ్చిందని గమనించిన ప్రస్తుత ధర్మాసనం, ఈ పిటిషన్ను అదే ధర్మాసనం పరిశీలించడం సముచితమని పేర్కొంది. ప్రస్తుత పిటిషన్లో లేవనెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవి అని పేర్కొన్న ధర్మాసనం, ఈ వ్యవహారాన్ని జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించింది. జస్టిస్ జె.బి. పర్దివాలా , జస్టిస్ ఆర్. మహాదేవన్ వెలువరించిన జనవరి 30 నాటి తీర్పు, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు , విద్యా హక్కులో భాగంగా గౌరవ ప్రదమైన రుతుక్రమ ఆరోగ్యాన్ని పొందే హక్కును గుర్తించింది.
లింగ సమానత్వం , విద్యాపరమైన సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక కీలక తీర్పులో, ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక లేదా ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రతి పాఠశాల కూడా నీటి సౌకర్యంతో కూడిన, లింగ-ఆధారిత వినియోగించ దగిన మరుగుదొడ్లను ఏర్పాటు చేసేలా చూడాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. బాలికలకు ఉచిత ‘ఆక్సో-బయో డిగ్రేడబుల్’ పర్యావరణానికి హాని చేయని శానిటరీ నాప్కిన్లను అందించాలని, అలాగే అత్యవసర సామాగ్రితో కూడిన ‘రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు పాఠశాలలను ఆదేశించింది.
అమెరికన్ విద్యావేత్త , సామాజిక కార్యకర్త మెలిస్సా బెర్టన్ మాటలను ఉటంకిస్తూ పీరియడ్ (రుతుక్రమం) అనేది ఒక వాక్యాన్ని ముగించాలి, కానీ ఒక బాలిక విద్యను కాదు అని జస్టిస్ పార్దీవాలా తన తీర్పును ప్రారంభిస్తూ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 21 కింద లభించే జీవించే హక్కు’లో ‘రుతుక్రమ ఆరోగ్య హక్కు’ కూడా అంతర్భాగమని కోర్టు పేర్కొంది; బాలికల గౌరవానికి , వారి విద్యాభ్యాసంలో భాగస్వామ్యానికి సురక్షితమైన, సమర్థవంతమైన , అందుబాటు ధరలో లభించే రుతుక్రమ పరిశుభ్రత సౌకర్యాలు అత్యవసరమని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, పిల్లలు గౌరవ ప్రదంగా పాఠశాలకు హాజరై తమ విద్యను పూర్తి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే, ఆర్టికల్ 21A కింద కల్పించబడిన ‘విద్యా హక్కు’ను అర్థవంతంగా అమలు చేయడం సాధ్యం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
