శ్రీవారి సేవలో ఉద్యోగుల అంకితభావం అభినంద‌నీయం

టీటీడీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌

తిరుప‌తి : టీటీడీలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల అనుభవాలు సంస్థకు ఎంతో విలువైనవని, వారి సేవానుభవాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో 16 మంది పదవీ విరమణ ఉద్యోగులకు సామూహిక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఉద్యోగులు తమ సేవా కాలంలో ఎదుర్కొన్న ముఖ్యమైన సంఘటనలు, సవాళ్లు, వాటిని అధిగమించిన విధానాలు, విధి నిర్వహణలో పొందిన అనుభవాలను నోట్ రూపంలో సిద్ధం చేసి సహచర ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు.

అనుభవజ్ఞులైన ఉద్యోగుల నుంచి లభించే ఈ విలువైన జ్ఞానం భవిష్యత్తులో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు దోహద పడుతుందని చె్పారు. ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన సర్వీస్ ప్రక్రియలను ముందుగానే పూర్తి చేసి, వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు. పదవీ విరమణ పొందే రోజే ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలు వారి ఖాతాల్లో జమ అయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

విద్యార్థులు క్రమశిక్షణతో తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, పట్టుదలతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈవో పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్య జీవితంలో ఉన్నత అవకాశాలతో పాటు సమాజంలో గౌరవాన్ని కూడా అందిస్తుందని తెలిపారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సన్మానించి, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో (విద్య, ఆరోగ్యం) ప్రభల గోపీనాథ్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, ఆనందరాజు, గోవిందరాజు, పదవీ విరమణ పొందిన అధికారులు ఈఈ జయరామ్ నాయక్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!