చెన్నై : శాసన సభ ఎన్నికల్లో సత్తా చాటిన సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రస్తుతం శాసన సభ సమావేశాలలో సైతం తనదైన ముద్ర కనబరుస్తున్నారు. మంత్రులు ప్రతిపక్షాలపై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇదే సమయంలో సీఎం ‘మిడ్‌ఫీల్డ్’లో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి , ఇతర ప్రతిపక్ష నాయకులను ఎదుర్కోవడానికి టీవీకే మంత్రులు పదేపదే రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి , టీవీకే అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ విషయానికి వస్తే తమిళనాడు శాసనసభ ఆయనకు ఒక ఫుట్‌బాల్ మైదానంలా మారింది. ఇందులో ఆయన ప్రధానంగా మైదానం మధ్య భాగంలో ఉంటూ ప్రతిపక్షాల ఒత్తిడిని తట్టుకోవడం, ఎదురుదాడికి దిగడం , చర్చను నడిపించడం వంటి బాధ్యతలను తన నమ్మకస్తులైన మంత్రులకు అప్పగించారు.
పాలన, బడ్జెట్ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, విరమించుకున్న పరంధూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ వివాదం, శాంతిభద్రతలు, నీట్, విద్యుత్ ధరలు, సరఫరా, కావేరీ-మేకెదాటు వివాదం , నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై ఈ మాటల యుద్ధం సాగుతోంది. అధికార పార్టీ తమ తరఫున ప్రధానంగా స్పందించే వారిని స్పష్టంగా గుర్తించింది. మంత్రులు ఆదావ్ అర్జున, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్‌కుమార్, ఎస్ రమేష్ , రాజ్‌మోహన్ సభలో ప్రభుత్వ ప్రధాన స్వరాలుగా ఉద్భవించారు. వీరిలో ప్రతి ఒక్కరూ వంతుల వారీగా కొత్త పరిపాలనను ముందుకు దూసుకు పోయే ప్రభుత్వంగా సమర్థిస్తూ, ప్రతిపక్షాన్ని సవాలు చేస్తున్నారు. వీరిలో ఆదావ్ అర్జున అత్యంత దూకుడు పాత్రను పోషించారు. ఉదయనిధితో ఆయన జరిపిన వాదోపవాదాలు లాటరీ సంబంధిత వివాదాలు, పార్టీ నిధుల నుండి మొదలుకొని గత డీఎంకే పాలనపై ఆరోపణలు, మద్యం విధానం, నియోజకవర్గాల పునర్విభజన, శాంతిభద్రతలు, కావేరీ వివాదం వరకు విస్తృత రాజకీయ అంశాలను స్పృశించాయి.
సాధారణ శాసన పరమైన చర్చలను రాజకీయ పోటీలుగా మార్చేశాయి. చట్టం , ఇంధన వనరుల శాఖను చూస్తున్న నిర్మల్‌కుమార్ కూడా తరచుగా ఈ వివాదంలోకి దిగగా, పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ , మరో మంత్రి రమేష్ ప్రభుత్వాన్ని సమర్థించడంలో, ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలో మరింత మితమైన వైఖరిని అవలంబించారు. అయినప్పటికీ ఈ వ్యూహం దాని బలహీనతలను కూడా బయటపెట్టింది.
