కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్

కుల ఆధారిత గ‌ణ‌న ముఖ్య ఉద్దేశం మారుతుంది

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కుల గణనపై తీర్మానం చేయాలని తమిళనాడు అసెంబ్లీని కోరారు. ప్రామాణికమైన ముందుగా నిర్ణయించిన ‘డ్రాప్-డౌన్’ జాబితా లేకుండా కులాల పేర్లను గణన సిబ్బంది స్వయంగా నమోదు చేయడానికి అనుమతించడం వల్ల తీవ్రమైన వ్యత్యాసాలు తలెత్తుతాయని, ఇది కుల ఆధారిత గణన ముఖ్య ఉద్దేశ్యాన్ని దెబ్బ తీస్తుందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ఆరోపించారు. రాబోయే 2027 జనాభా లెక్కల్లో కుల వివరాలను నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఓపెన్-ఎండెడ్’ (స్వేచ్ఛా నమోదు) విధానంపై స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, లోపం లేని గణన ప్రక్రియను చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలని స్ప‌ష్టం చేశారు.

కులాల పేర్లను నమోదు చేసేటప్పుడు ముందుగా నిర్ణయించిన జాబితా లేక పోవడం వల్ల గణాంకాలలో గందరగోళం ఏర్పడుతుందని మాజీ సీఎం పేర్కొన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో వ్యక్తిగత కులాలు కాకుండా కేవలం వర్గాలు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అన్నారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి వారి అధికారిక వెనుకబడిన తరగతుల, అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలను సేకరించి, ఆ ప్రామాణిక వర్గాలను గణన విధానంలో చేర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు. నిర్దిష్ట జాబితా నుండి ఎంచుకునే అవకాశాన్ని పౌరులకు కల్పించడం ద్వారానే ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం సాధ్యమవుతుందని అన్నారు ఎంకే స్టాలిన్. అలా కాకుండా స్వేచ్ఛా నమోదు విధానం వల్ల గందరగోళ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!